2021 ఆగస్టు 1 నుంచి ATM చార్జీలు పెంపు
ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పై బ్యాంకుల ఇంటర్ చేంజ్ ఫీజుల్లో ఆర్బీఐ ఇటీవల చేసిన సవరణలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ఆర్థిక లావాదేవీల ఇంటర్ చేంజ్ ఫీజును రూ.15 నుంచి 17కు పెంచగా, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి 6 కు పెంచింది. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం వ్యాపారుల నుంచి ఈ ఇంటర్‌చేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తాయి.
తమకు ఖాతాలున్న బ్యాంక్ ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు కస్టమర్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కలిపి ఈ పరిమితి వర్తిస్తుంది. ఇక ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లోనైతే 3 సార్లు, నాన్-మెట్రో నగరాల్లో 5 సార్లు ఉచితంగా లావాదేవీలను జరుపవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిమితి దాటిన ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీలుండగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.21 వసూలు చేయనున్నారు. ఏటీఎం ల నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఈ చార్జీల పెంపునకు అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ఓ తాజా ప్రకటనలో తెలిపింది.